PM Modi: ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ
ఈసారి మనం ప్రత్యేకమైన దీపావళిని చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆన్‌లైన్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో పాల్గొని ధన త్రయోదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 500 సంవత్సరాల తరువాత, అయోధ్య ఆలయంలో శ్రీరాముడు కొలువైన సందర్భంగా ఈ దీపావళి జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ మంత్రిత్వశాఖల నుండి నియామకాలు చేపడుతున్నారు.
విశాఖపట్నం, హైదరాాబాద్ లో రోజ్ గార్ మేళా
ఈ ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరికి 'కర్మయోగి ప్రారంభ్' విధానం కింద శిక్షణ అందిస్తున్నారు. ఐజీవోటీ కర్మయోగి పోర్టల్ ద్వారా దాదాపు 1,400 కోర్సులను అందుబాటులో ఉంచారు. దీని ద్వారా వారికి వివిధ రంగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, హైదరాబాద్‌లో ఈ మేళాలను నిర్వహించారు. వైజాగ్‌లో వీఎంఆర్డీఏలో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, అక్కడ 155 మందికి నియామక పత్రాలను అందించారు.