అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. 2023-24లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఎన్నికల సింబల్స్ ఆర్డర్ 1968లోని పేరా 10 బీసీని అనుసరించి ఎన్నికల్లో పోటీ కోసం రాజకీయ పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భారత ఎన్నికల ఆహ్వానించింది.
తెలంగాణలోని పార్టీలు జులై 17 తర్వాత, ఏపీలోని పక్షాలు డిసెంబర్ 12 తర్వాత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని ఈసీ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో పోటీ చేసే రాజకీయ పార్టీలు డిసెంబర్ 12తర్వాత గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఈ ఏడాది డిసెంబర్ 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని ఈసీ ఆహ్వానించింది. 2023-24లో ఏపీ, తెలంగాణతో పాటు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కీం, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.