Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది
సమాజంలో మహిళల భద్రత, గౌరవంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ మహిళకైనా భద్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితులు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదైనా దేశ బలం మహిళల సాధికారతపైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆమె సీఎన్‌ఎన్-న్యూస్18 నిర్వహించిన షీశక్తి 2024 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఆడవారి భద్రతకు సంబంధించి కఠినచట్టాలు
''మహిళలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా,ధైర్యం,శక్తితో ముందుకు సాగుతున్నారు.మన దేశంలో మహిళా భద్రత కోసం కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ,దురదృష్టవశాత్తు,భద్రతా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సంప్రదాయవాదం, సామాజిక సంకుచిత భావాల వల్ల మహిళలు వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. సమాజంలో మార్పులు వచ్చినప్పటికీ, కదిలిపోలేని సామాజిక అభిప్రాయాలు మహిళా సమానతకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు సమాజంగా మనం ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం ఉంద'' అని ద్రౌపది ముర్ము అన్నారు.
"బ్రేకింగ్ బ్యారియర్స్" అనే థీమ్‌తో షీశక్తి కార్యక్రమం
మహిళల భద్రత,గౌరవం దేశ ప్రగతికి కీలకమని, అందరం కలిసి మహిళల రక్షణను, మర్యాదను కాపాడడానికి కట్టుబడి ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. మనం పుట్టిన ప్రదేశాన్ని తల్లిగా భావించే సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామని, మహిళలను దేవతలుగా పూజించే సాంప్రదాయాన్ని కూడా నిలుపుకురావాలన్నారు. మహిళలు నిజమైన శక్తికి ప్రతిరూపాలని, కాళీ, దుర్గ వంటి దేవతల రూపంలో దుష్ట సంహారం చేయగల శక్తిగా, లక్ష్మీ, సరస్వతిలా ఆశీర్వదించే శక్తిగా కొలుస్తామని చెప్పారు. ఈ సారి షీశక్తి కార్యక్రమం "బ్రేకింగ్ బ్యారియర్స్" అనే థీమ్‌తో జరుగుతుందని, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని ఆమె చెప్పారు.