Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర నివేదక ఇవ్వండి.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, "నేను సీఎం చంద్రబాబుతో మాట్లాడాను. ఈ విషయంలో వారికి ఉన్న సమాచారాన్ని పంపమని కోరాను. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి సహకరిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికి నివేదికను మాత్రమే కోరాం" అని తెలిపారు.
ప్రసాదంలో కల్తీపై కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరుమల ప్రసాదంలో కల్తీపై మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఘటన క్షమించరాని నేరమని పేర్కొంటూ, దీనికి మత సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బోర్డులో అన్యమతస్తుల కారణంగానే కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని చెప్పారు. బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఈ విషయంపై స్పందించారు. ''ఇది ప్రజల విశ్వాసంపై నేరుగా జరిగిన దాడి. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడం, వ్యాపార ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర'' అని విమర్శించారు. ఈ వ్యవహారంలో కారకులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని నఖ్వీ అభిప్రాయపడ్డారు.
హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారంలోకి లగడాన్ని,ఆ పార్టీ ఖండించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం హైకోర్టుకు చేరుకుంది. శ్రీవారి లడ్డూ తయారీ అంశంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారనే ప్రచారాన్ని నిలిపివేయడానికి ఆదేశాలివ్వాలని, విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు స్పందిస్తూ, అత్యవసర విచారణ అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది.