Loading...
TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్
టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్

TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. ఆయన స్థానంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేశ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు టీఐఎస్ఎస్ వెల్లడించింది. వాయిదా పడిన స్నాతకోత్సవాన్ని ఆగస్టు 22న నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందుగా ఆగస్టు 2న స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని టీఐఎస్ఎస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అయితే కార్యక్రమానికి రెండు రోజుల ముందు అనూహ్య కారణాలతో పాటు అనుకూల పరిస్థితులు లేవంటూ స్నాతకోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

హైదరాబాద్ నల్సార్ వివాదం నేపథ్యంలో తాజా పరిణామం

సీజేఐ హాజరుపై విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని, భద్రతాపరమైన కారణాలతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనకు విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

కొన్ని కేసుల విచారణ సమయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలను వారు దీనికి కారణంగా ప్రస్తావించారు.

అయితే నల్సార్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు తాను అక్కడికి హాజరయ్యే ప్రశ్నే లేదని సీజేఐ కార్యాలయం స్పష్టం చేసింది.

వివరాలు 

సీజేఐ స్థానంలో డాక్టర్ సి.ఎస్. ప్రమేశ్

నల్సార్ వ్యవహారం తర్వాత కొద్దిరోజులకే టీఐఎస్ఎస్ స్నాతకోత్సవం నుంచి కూడా సీజేఐ సూర్యకాంత్ తప్పుకోవడం చర్చకు దారితీసింది.

తాజాగా విడుదల చేసిన ఆహ్వానపత్రికలో సీజేఐ పేరును తొలగించి, ఆయన స్థానంలో డాక్టర్ సి.ఎస్. ప్రమేశ్ పేరును చేర్చారు.

అయితే సీజేఐ కార్యాలయమే ఆయన పర్యటనను రద్దు చేసిందా? లేదా టీఐఎస్ఎస్ యాజమాన్యం సంస్థాగతంగా ఈ నిర్ణయం తీసుకుందా? అనే అంశంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ADVERTISEMENT