TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరిపై బహరంపూర్ స్థానం నుంచి క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను తృణమూల్ బరిలోకి దింపింది. బర్ధమాన్-దుర్గాపూర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ కీర్తి ఝా ఆజాద్‌కు కేటాయించారు. బరాక్‌పూర్ నుంచి అర్జున్ సింగ్ స్థానంలో రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌కు తృణమూల్ టికెట్ ఇచ్చింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో టీఎంసీ బహిరంగ సభ సందర్భంగానే మమతా బెనర్జీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎస్పీకి చెందిన అఖిలేష్ యాదవ్‌తో తృణమూల్ కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.