TMC MPs: ఐ-ప్యాక్‌పై సోదాలు.. ఢిల్లీలో షా కార్యాలయం బయట టీఎంసీ ఎంపీల నిరసన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబట్టి హోంశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కొనసాగుతుండగానే ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎంపీలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళన సమయంలో తమను బలవంతంగా లాక్కెళ్లారని టీఎంసీ నేతలు విమర్శించారు.
వివరాలు
ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు
ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలను ఖండిస్తూ టీఎంసీ ఎంపీలు ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చారు. డెరిక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా సహా పలువురు ఎంపీలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు ఓ అధికారి తెలిపారు. అయితే వారిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.