Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశం నుంచి దృష్టి మరల్చడానికి కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇలాంటి పనులు చేస్తోందని స్టాలిన్ అన్నారు. బీజేపీ అమలు చేస్తున్న ఇలాంటి వ్యూహాలకు డీఎంకే భయపడదని నొక్కిచెప్పారు. 2007 నుంచి 2011 మధ్య డీఎంకే ప్రభుత్వంలో గనులశాఖ మంత్రిగా పొన్ముడి ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పొన్ముడి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించినట్లు విశ్వసనయ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో జరుగుతున్న విపక్ష పార్టీ సమావేశానికి వెళ్లే ముందు స్టాలిన్ మీడియాతో మాట్లాడారు.
కేసులను పొన్ముడి న్యాయపరంగా ఎదుర్కొంటారు: స్టాలిన్
తమపై తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి వ్యవహరిస్తున్న తీరు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం డీఎంకే ప్రచారానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు స్టాలిన్ అన్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం తమకు మరింత సులభతరం అవుతుందని స్పష్టం చేసారు. ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు పొన్ముడిపై తప్పుడు కేసు నమోదు చేశారని స్టాలిన్ అన్నారు. ఈ కేసు 13 సంవత్సరాల క్రితం నమోదైందని, అన్నాడీఎంకే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పొన్ముడిపై ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో పొన్ముడిపై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనుక అతను ఈ కేసులను చట్టపరంగా కూడా ఎదుర్కొంటారని చెప్పారు.