Supreme Court : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇక కరెంట్ బిల్లులోనే బాదుడు.. సుప్రీంకోర్టు కీలక సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ఈ-చలాన్ల బకాయిలను వేగంగా వసూలు చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పేరుకుపోయిన చలాన్ల మొత్తాన్ని వాహనదారుల విద్యుత్ బిల్లులకు అనుసంధానించి వసూలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంప్రదాయ పద్ధతులతో భారీగా పేరుకుపోయిన బకాయిలను పూర్తిగా వసూలు చేయడం కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
వివరాలు
చలాన్లు చెల్లించని వారిపై కఠిన చర్యలు
భారీగా పేరుకుపోతున్న ఈ బకాయిలపై జస్టిస్ పార్ధివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది.
సంప్రదాయ విధానాలకే పరిమితమైతే ఈ బకాయిల వసూళ్లు సాధ్యం కావని పేర్కొంది.
ఈ-చలాన్ల మొత్తాన్ని విద్యుత్ బిల్లులతో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
ఈ-చలాన్లను చెల్లించకుండా బకాయి పెట్టే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
అలాంటి వారికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) పునరుద్ధరణను నిలిపివేయడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీని నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.
బకాయిల వసూళ్లను సమర్థంగా చేపట్టేందుకు అధికారులు సంప్రదాయ విధానాలకు భిన్నంగా వినూత్న, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.