Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వారణాసి-న్యూఢిల్లీ మధ్య ఆరెంజ్ కలర్ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధాన మంత్రి ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నట్లు ఉత్తర రైల్వే తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలో ప్రారంభించబోతున్న రెండవ ఆరెంజ్ కలర్(saffron colour) వందే భారత్ రైలు అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ఉత్తర రైల్వే ఆరెంజ్ కలర్ లో ఉన్న రైలు ఫోటోను కూడా షేర్ చేసింది.
రైలులో అనేక కొత్త ఫీచర్లు
ఈ రైలులో ఆన్‌బోర్డ్ Wi-Fi ఇన్ఫోటైన్‌మెంట్, GPS-ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూజ్డ్ LED లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు,వ్యక్తిగత టచ్-ఆధారిత రీడింగ్ లైట్లు, రోలర్ బ్లైండ్‌లు, వంటి అత్యుత్తమ ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి. ఈ ట్రైన్ లో మెరుగైన హీట్ వెంటిలేషన్,ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో పాటు సూక్ష్మక్రిమి లేని గాలి సరఫరా కోసం UV ల్యాంప్ ఉంది. ఇంటెలిజెంట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వాతావరణ పరిస్థితులు/ఆక్యుపెన్సీకి అనుగుణంగా శీతలీకరణను సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. రైలు వారణాసి నుండి న్యూఢిల్లీకి మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 24న మొదటి ఆరెంజ్-గ్రే రంగు రైలు ప్రారంభం
వారణాసి నుండి ఈరైలు న్యూఢిల్లీకి మధ్యాహ్నం 2:05 గంటలకు చేరుకుంటుంది.అనంతరం 3 గంటలకు వారణాసికి బయలుదేరుతుంది. ఇది రాత్రి 11:05 గంటలకు వారణాసి చేరుకుంటుంది.ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న మొదటి వందే భారత్ రైలు ఢిల్లీ నుండి ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. ఇది మధ్యాహ్నం 3గంటలకు న్యూఢిల్లీకి బయలుదేరి రాత్రి 11గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇది గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. మొదటి ఆరెంజ్-గ్రే రంగు వందే భారత్ రైలును సెప్టెంబర్ 24న కేరళలోని కాసరగోడ్- తిరువనంతపురం మధ్య రైల్వేశాఖ ప్రారంభించింది. సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఇది ఒకటి.