నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ
మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు నాలుగు నెలలుగా చెలరేగుతున్న హింసాకాండపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. మణిపూర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం చివరిసారిగా ఫిబ్రవరి-మార్చిలో సమావేశమైంది. అనంతరం మే3న రాష్ట్రంలో హింస చెలరేగడంతో వర్షాకాల సమావేశాలు నిర్వహణ ఆలస్యమైంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరిగే నిర్వహించున్నట్లు స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయం లేదా ప్రైవేట్ మెంబర్ మోషన్ ఉండదన్నారు. ఒక్కరోజు మాత్రమే సమావేశాలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కుకీ-జోమి గిరిజన సంస్థలు ఒకరోజు సమావేశాన్ని తిరస్కరించాయి.
జాతి సంక్షోభంపై కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం
ప్రస్తుతం కొనసాగుతున్న జాతి సంక్షోభంపై కొన్ని తీర్మానాలను సెషన్‌లో ఆమోదించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఆమోదించిన ఏ తీర్మానానికి తాము కట్టుబడి ఉండబోమని కుకీ ప్రాభల్య ప్రాంతాల్లోని గిరిజన సంఘాలు తీర్మానించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం ఆరు నెలలలోపు అసెంబ్లీని ఒకసారి సమావేపర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం కేవలం అసెంబ్లీని సమావేశపర్చడం కోసం మాత్రమే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఒక గుంపు మూడు పాడుబడిన ఇళ్లకు నిప్పు పెట్టారు.