INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాల కూటమి సిద్ధమవుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని, సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ప్రతిపక్షల ఎంపీల సమావేశం; విప్ జారీ చేసిన కాంగ్రెస్
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్‌రంజన్ చౌదరి వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. నోటీసు కోసం ఎంపీల సంతకాల సేకరణ కోసం ఇండియా కూటమి ఎంపీలు బుధవారం ఉదయం సమావేశం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన లోక్ సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్‌సభ ఎంపీలందరూ పార్లమెంట్‌కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరగనుంది. దీంతో పాటు ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడంపై రాజ్యసభలో విపక్ష ఎంపీల నిరసన పార్లమెంట్ ఆవరణలో కొనసాగుతోంది.
మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి అమిత్ షా లేఖ
పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సహకరించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరిలకు లేఖ రాశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరూ సహకరించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అధిర్ రంజన్ చౌదరికి రాసిన లేఖల్లో అమిత్ షా పేర్కొన్నారు. అంతకుముందు, ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీల కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిని 'ఈస్ట్ ఇండియా కంపెనీ', 'ఇండియన్ ముజాహిదీన్' వంటి పేర్లతో పోల్చారు. దేశం పేరును ఉపయోగించి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించలేరని అన్నారు.