Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.
వైట్ హౌస్‌లో ఇద్దరు నాయకులు సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, ఒప్పందాల గురించి సమాలోచనలు చేశారు.
ఈ పర్యటనలో భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ట్రంప్ నినాదమైన "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA)" నకు అనుగుణంగా, భారతదేశ అభివృద్ధి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ "మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ (MIGA)" అనే పదాన్ని ప్రస్తావించారు. మోడీ తన ప్రసంగంలో, ఇండియాను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యానికి 500బిలియన్ డాలర్లు
ప్రధాని మోదీ, ''MIGA కలిస్తే అది 'MEGA' భాగస్వామ్యాన్ని తీసుకువస్తుంది''అని చెప్పారు.
''అమెరికా ప్రజలకు 'MAGA' అంటే ఏంటో బాగా తెలుసు.అలాగే, భారత్ 'వికసిత భారత్ 2047' లక్ష్యంతో ముందుకు సాగుతోందని,అదే అమెరికా భాషలో చెప్పాలంటే 'MIGA' అని అభివర్ణించవచ్చు'' అని వివరించారు.
ఈ రెండు దేశాల అభివృద్ధి లక్ష్యాలు కలిస్తే,ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే విధంగా అవుతాయని ఆయన అన్నారు.
2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500బిలియన్ డాలర్ల స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల నాయకులు సంకల్పించారు.
పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఒప్పందాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
అలాగే,ఉమ్మడి అభివృద్ధి,ఉమ్మడి ఉత్పత్తి,సాంకేతిక పరిజ్ఞానం మార్పిడిపై రెండూ దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.