
Rahul Gandhi: ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశవ్యాప్త ఓటర్ల జాబితా, వీడియోలు విడుదల చేయాలని డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాజ్యాంగం అందించిన 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' హక్కుపై ఎవరైనా దాడి చేస్తే, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై కూడా దాడి చేస్తామని, కాంగ్రెస్ అగ్రనేత,లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కఠిన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన నిరసన సమావేశంలో ఆయన ఈ విషయాలను ఉల్లేఖించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ఇది కేవలం తన గొంతు కాదని, యావత్ హిందుస్థాన్ గొంతుక అని స్పష్టం చేశారు.
వివరాలు
'ఒక వ్యక్తి, ఒక ఓటు' హక్కుపై దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరిక
ఎన్నికల మోసం ఫిర్యాదుపై తన నుంచి అఫిడవిట్ కోరారని, కానీ తాను ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని రాహుల్ గుర్తుచేశారు. "రాజ్యాంగంలోని మౌలిక సూత్రం 'ఒక వ్యక్తికి ఒక ఓటు'. ఈ సూత్రంపైనే ఈసీ అధికారులు దాడి చేస్తున్నారు అంటే అంటే మీరు పేదలపై దాడి చేస్తున్నారు అని అర్థం. ఎన్నికల్లో మోసం చేసి సులభంగా తప్పించుకోవచ్చని అనుకోవడం తప్పు. సమయం పట్టొచ్చు, కానీ ఒక్కొక్కరినీ తప్పకుండా గుర్తించి శిక్షిస్తాం" అని ఆయన హెచ్చరించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాహుల్ గాంధీ చెప్పారు. అక్కడి ఎన్నికల్లో బీజేపీ,ఈసీ కలిసి మోసం చేశారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
వివరాలు
ఐదు ప్రధాన పద్ధతుల్లో ఈ మోసం
"మహాదేవపురలో సుమారు 6.5 లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ,1.25లక్షల ఓట్లను దొంగిలించారు.అంటే ప్రతి ఆరుగురిలో ఒక ఓటును తారుమారు చేశారు"అని ఆయన వివరించారు. ఈ మోసం ఐదు ప్రధాన పద్ధతుల్లో జరిగిందని రాహుల్ ఆరోపించారు. 1. సుమారు 12,000 నకిలీ ఓటర్లు ఐదారు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేశారు. 2. దాదాపు 40,000 ఓట్లను నకిలీ గుర్తింపు పత్రాలతో నమోదు చేశారు. 3. ఒకే ఇంటి చిరునామాలో వందల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. ఒక బీజేపీ నేత ఇంటికి 40 మంది ఓటర్లు ఉన్నట్లు చూపించారు కానీ పరిశీలిస్తే అక్కడ ఎవరూ లేరు. 4.సుమారు 4,000 ఓటర్లకు ఫొటోలు లేకపోవడంతో లేదా ఉన్న ఫొటోలు అస్పష్టంగా ఉండటం కూడా అందులో ఒక భాగం.
వివరాలు
దేశవ్యాప్త ఓటర్ల జాబితా, వీడియోలు విడుదల చేయాలని డిమాండ్
5. ఫారం 6 ద్వారా కొత్తగా చేర్చిన 34,000 ఓట్లలో చాలా మంది వయసు 89 నుంచి 95 సంవత్సరాల మధ్య ఉన్నారని, ఇది అనుమానాలకు దారితీస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ దేశ రాజ్యాంగ ప్రయోజనాల కోసం పనిచేయాలని, కానీ బీజేపీ కోసం పనిచేయకూడదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాలు, పోలింగ్ వీడియో రికార్డింగ్‌లను విడుదల చేస్తే, ఈ మోసం కేవలం కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా జరిగిందని నిరూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. ఈ పోరాటంలో తాను ఒంటరి కాదన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలంతా ఇదే సమస్యపై ఆందోళన చెందుతుండగా, ఎన్నికల కమిషన్ వెంటనే సంబంధిత డేటాను ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు.