LOADING...
Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం
పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం

Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ (లీగల్‌) బ్రాంచ్‌లోని ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం చట్టపరంగా సమర్థించదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మహిళలకు అవకాశాలను పరిమితం చేసి, మిగిలిన ఖాళీలను పురుషులకు కేటాయించే విధానం అమలు చేయరాదని స్పష్టం చేసింది. జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ లీగల్‌ విభాగంలో జరిగిన నియామక పరీక్షల్లో మహిళా అధికారులు అష్నూర్‌ కౌర్‌ నాలుగో ర్యాంక్‌, ఆస్థ త్యాగీ ఐదో ర్యాంక్‌ సాధించారు. కానీ, మహిళా కోటాలో ఖాళీలు లేవన్న కారణంతో వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పురుష అభ్యర్థుల కంటే మెరుగైన ర్యాంకులు సాధించినప్పటికీ తమకు అవకాశం కల్పించలేదని ఆవేదన చెందుతూ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

ఆర్మీ అధికారుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, అప్పట్లో తీర్పును నిలిపివేసి రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం, ఆర్మీ అధికారుల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''పురుషులకు ఆరు, మహిళలకు మూడు పోస్టులు కేటాయించే నిష్పత్తి పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. నిజమైన లింగతటస్థత అంటే, స్త్రీ-పురుష భేదం లేకుండా అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేయడమే. మహిళలకు సీట్ల పరిమితి విధించడం, సమానత్వ హక్కును ఉల్లంఘించడం అవుతుంది. అంతేకాదు, మహిళలపై ఈ రీతిగా ఆంక్షలు పెట్టి ఖాళీ స్థానాలను పురుషులకు కేటాయించడం అన్యాయం'' అని వ్యాఖ్యానించింది.

వివరాలు 

 సమానత్వ పద్ధతిలోనే  నియామకాలు 

ఇలాంటి రిజర్వేషన్‌ విధానాలు కొనసాగితే దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించిన సుప్రీంకోర్టు, ఇకముందు నియామకాలు పూర్తిగా సమానత్వ పద్ధతిలోనే జరగాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఎంపిక ప్రక్రియలో స్త్రీ-పురుష అభ్యర్థుల మెరిట్‌ జాబితాను బహిర్గతం చేయాలని కూడా సూచించింది.