LOADING...
Heavy Rains: రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్‌ డ్యామ్‌.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!
రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్‌ డ్యామ్‌.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!

Heavy Rains: రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్‌ డ్యామ్‌.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్‌ డ్యామ్‌ పొంగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతమైంది. దాంతో గ్రామంలో సుమారు 2 కిలోమీటర్ల మేర జలపాతం లాంటి గుంత ఏర్పడింది. ఈ గుంత 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో భీకరంగా ఉంది. వరద తాకిడికి రెండు ఇండ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.

Details

వందలాది గ్రామాలు జలమయం 

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కరోడి లాల్‌ మీనా ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి గుంత ఏర్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని యంత్రాల సహాయంతో మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు పొందారు. అయితే భూమి కోతను ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రించడం కష్టమని గ్రామస్థులు చెబుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజస్థాన్‌లో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కోటా, బుండీ, సవాయ్‌ మాధోపూర్‌, ఝాలావార్‌ జిల్లాలు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి. కోటా జిల్లా నిమోడా గ్రామంలో 400కు పైగా ఇళ్లు కూలిపోగా, వందలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్మీతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.