Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం తీవ్ర చలితో వణుకుతోంది. జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీగా మంచు కురుస్తోంది. శుక్రవారం నుంచి విపరీతంగా కురుస్తున్న మంచుతో జమ్ముకశ్మీర్ లోని పలు ప్రాంతాలు శ్వేతవర్ణంగా మారిపోయాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగా పలు రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు మొఘల్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం నుండి విమానాల సేవలను నిలిపివేశారు. రైల్వే ట్రాక్‌లపై మంచు పేరుకుపోవడంతో బనిహాల్-బారాముల్లా మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
శ్రీనగర్‌కు వెళ్లే విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దు
దాదాపు 2,000 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పరిస్థితిని వివరిస్తూ, "బనిహాల్ నుండి శ్రీనగర్ వరకు మంచు కురుస్తూనే ఉందని, ఖాజిగుండ్ వద్ద 2,000 వాహనాలు మంచులో కూరుకుపోయాయని చెప్పారు. వాతావరణ మార్పులు కారణంగా శ్రీనగర్‌కు వెళ్లే విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దు చేసినట్లు ప్రకటించింది. విద్యాశాఖ అధికారులు, శనివారం కశ్మీర్ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. శ్రీనగర్, గందర్‌బల్, అనంత్‌నాగ్, కుల్గాం, షోపియాన్, పుల్వామా జిల్లాల్లో ఈ సీజన్‌లో మొదటి హిమపాతం నమోదైంది. గుల్‌మార్గ్, సోనామార్గ్, పహల్గామ్, గురేజ్, మొఘల్ రోడ్, బండిపోరా, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.