Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో పలువురు గాయపడగా, మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 14, 15 ప్లాట్‌ఫాంల వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అయితే ఇప్పటి వరకు రైల్వే శాఖ నుంచి మృతులపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
Details
అనూహ్య రద్దీ కారణంగానే తొక్కిసలాట
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వివరించారు.
ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రద్దీ నియంత్రించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండగా, మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై గుమిగూడారు.
ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణంగా తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు భావిస్తున్నారు.