'10మంది ముస్లిం బాలికలను ట్రాప్ చేయండి, భద్రత కల్పిస్తాం'; శ్రీరామ్ సేన అధ్యక్షుడు సంచలన కామెంట్స్
'లవ్ జిహాద్'ను ఎదుర్కొనేందుకు కర్ణాటకలో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. 'లవ్ జిహాద్'కు ప్రతిగా ముస్లిం యువతులను ఆకర్షించాలని హిందూ యువకులకు శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ పిలుపునిచ్చారు. ఒక్క హిందూ అమ్మాయిని పోగొట్టుకుంటే బదులుగా 10మంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయాలన్నారు. అలా చేసిన వారికి శ్రీరామ్ సేన భద్రత కల్పించడంతో పాటు ఉపాధిని అందిస్తామని చెప్పారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ముతాలిక్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి మద్దతు ఇచ్చి ఉంటే ఎన్నో ప్రయోజనాలు పొందేవాడిని: ప్రమోద్
ఉడిపిలోని కర్కల సెగ్మెంట్ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రమోద్ ముతాలిక్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఇప్పటివరకు 109 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఎక్కువ భాగం బీజేపీ హయాంలోనే అయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు కొందరు బీజేపీ నేతలు ఆర్థిక సాయం చేసేందుకు ముందకొచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో పోరాడాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియకపోయినా, తన అభిప్రాయాలు ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నాయని శ్రీరామ సేన అధినేత అన్నారు. బీజేపీ బూటకపు హిందుత్వకు నేను మద్దతిచ్చి ఉంటే ఈపాటికి ఎన్నో విజయాలు సాధించి ఉండేవాడినని పేర్కొన్నారు.