
Pawan Kalyan: జనసేన కార్యకర్తలకు త్రిశూల్ సిద్ధాంతం.. భవిష్యత్ నాయకత్వం సిద్ధం చేస్తాం : పవన్
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం 'త్రిశూల్ సిద్ధాంతం' అమలు చేయనున్నట్లు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతి క్రియాశీలక సభ్యుడిని పార్టీ సెంట్రల్ ఆఫీస్‌తో అనుసంధానం చేసే విధానాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామం స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయికి కొత్త నాయకత్వం తీసుకురావడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతాల ఆధారంగా ఎన్ని రోజుల వరకు రాజకీయాలు సాగిస్తారని ప్రశ్నిస్తూ, మీ విలువ తెలియజేయడానికే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన 'సేనతో సేనాని సభ'లో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మెంబర్‌షిప్ నుంచి లీడర్‌షిప్ వరకు తీసుకెళ్లడమే జనసేన లక్ష్యం.
Details
బలమైన నాయకత్వాన్ని తీసుకొస్తాం
నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం. ప్రతిరోజూ నాలుగు గంటలు పార్టీ కోసం కేటాయిస్తా. 2029 నుంచి 2030 నాటికి బలమైన కొత్త నాయకత్వం తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే పార్టీ కట్టుబాటు అని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన కార్యకర్తలను తానే స్వయంగా గుర్తిస్తానని, పార్టీ వారిని ముందుకు తీసుకెళ్తుందని పవన్ అన్నారు. కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కాపాడడం పార్టీ బాధ్యత అని తెలిపారు. సామర్థ్య నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దసరా తర్వాత పార్టీ విభాగాలపై పూర్తిగా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
Details
పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కృషి
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడుతూ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపినదీ, రైల్వే జోన్‌కు భూములు ఇవ్వని గత ప్రభుత్వానికి బదులుగా మనమే భూములు ఇచ్చామని వివరించారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 'తల్లికి వందనం', 'దీపం పథకం', 'స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్', పల్లె పండుగలు, గ్రామసభలు, సీసీ రోడ్లు, మినీ గోకులాలు, లక్ష నీటి కుంటలు విజయవంతంగా అమలు చేసిన పథకాలు అని గుర్తుచేశారు. "మీరు నిలబడితే మీ వెన్నంటే నిలిచి నడిపిస్తాను" అని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
Details
15 ఏళ్లపాటు సుస్థిర ప్రభుత్వం అవసరం
సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో భాగంగా 150 ఏళ్ల గురజాడ అప్పారావు ఇంటిని పునర్నిర్మించి, లైబ్రరీని డిజిటలైజ్ చేస్తామని ప్రకటించారు. దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయాలని సూచిస్తూ, దేశ బలపరచడంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి బలంగా కొనసాగాలని కోరుకుంటున్నానని, 15 ఏళ్లపాటు సుస్థిర ప్రభుత్వం అవసరమని తెలిపారు. చిన్నపాటి తప్పులు జరిగితే, చంద్రబాబుతో కూర్చుని పరిష్కరిస్తా. మన కోపం వల్ల జరిగే పొరపాట్లు ప్రజలకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ వస్తే చీకటి రోజులు తిరిగి వస్తాయి, అరాచక శక్తులు మళ్లీ పుంజుకుంటాయని ఆయన హెచ్చరించారు.