Vijay Post: మళ్లీ ప్రయత్నించండి.. గెలుపు మీదే.. విజయ్ పోస్టు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా నటుడు, తమిళగ వెట్రి కళగం(TVK)అధినేత విజయ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అక్కడి రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయోనన్న ఉత్కంఠ నెలకొన్న తరుణంలో తమిళనాడులో తాజాగా విడుదలైన 12వ తరగతి ఫలితాలపై విజయ్ స్పందించారు. పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. కష్టపడి చదివితే విజయాన్ని తప్పకుండా అందుకోవచ్చని విజయ్ పేర్కొన్నారు. "పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈవిజయం మీ కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు. ఉన్నత విద్యలో ఇంకా మెరుగైన స్థాయికి చేరాలని కోరుకుంటున్నా. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
వచ్చే ప్రయత్నంలో విజయం ఖాయం
అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను కూడా విజయ్ ప్రోత్సహించారు. "ఈసారి విజయం దక్కకపోయిందని నిరాశ చెందకండి. మళ్లీ ప్రయత్నించండి. మనం విజయానికి చాలా దగ్గరలో ఉన్నామని గుర్తుంచుకోండి. వచ్చే ప్రయత్నంలో విజయం ఖాయమంటూ ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిస్థితులపై విజయ్ స్పందన కోసం అభిమానులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల్లో TVK మంచి విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం చేరుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు విజయ్‌కు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ ఆయనకు బలం చేకూరుస్తున్నారు.