బయోమెట్రిక్ హాజరు లేకుండానే గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు
జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది. ఇటీవలే గ్రూప్ 1 పరీక్షలోనూ బయోమెట్రిక్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహించింది. అయితే కమిషన్ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పరీక్ష నిర్వహణలో పటిష్టమైన చర్యలను అమలు చేయకపోవడానికి గల కారణాలను హైకోర్టు ఆరా తీసింది. పోటీ పరీక్షలకు బయోమెట్రిక్ హాజరును ఎందుకు తీసుకోవట్లేదని కమిషన్ ను నిలదీసింది. అయినప్పటికీ తాజా గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహణలోనూ టీఎస్పీఎస్సీ పాత ధోరణతోనే కొనసాగుతుండటంపై అభ్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
9.51 లక్షల మందికి బయోమెట్రిక్ అటెండెన్స్ సాధ్యం కాదు : టీఎస్పీఎస్సీ
పోటీ పరీక్షల నిర్వహణను ఖర్చుల కోణంలో చూడకూడదని, ఫలితంగా లొసుగులకు అవకాశం ఇవ్వొద్దని సూచనలు చేసింది. పరీక్షల నిర్వహణలో గత కొన్నాళ్లుగా కమిషన్ ఇదే విధానాన్ని అమలు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓఎంఆర్ షీట్లపై హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకపోతే వాటిని మార్చి తారుమారు చేసే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనికి స్పందించిన కమిషన్ ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందునే బయోమెట్రిక్ హాజరు సహా ఓఎంఆర్ అమలు చేయట్లేదని కమిషన్ అధికారులు వెల్లడించడం గమనార్హం. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టులకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లో 2,846 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.