TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, మెట్రో బస్సులతో సహా ఆర్టీసీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించేందుకు అందించే టీ-24 టికెట్ ధరను రూ.100నుంచి రూ.90కు తగ్గించినట్లు పేర్కొంది. అలాగే తగ్గించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు టీ-24 టిక్కెట్ ధరల్లో 20శాతం రాయితీ అందిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సీనియర్ సిటిజన్‌లకు టీ-24టిక్కెట్‌ను రూ. రూ. 80లకే ఆర్టీసీ అందిస్తోంది. అయితే, సీనియర్ సిటిజన్లు టికెట్ తీసుకునే సమయంలో వయస్సు ధృవీకరణ కోసం బస్ కండక్టర్లకు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది.
రోజుకు 25వేల టీ-24 టిక్కెట్ల విక్రయం
టీ-24 టిక్కెట్‌పై ప్రయాణీకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజూ సగటున 25,000 టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. లీటరు పెట్రోల్ కంటే తక్కువ ఖర్చుతో 24గంటల ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించడానికి టీ-24 టికెట్ ధరను తగ్గించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గతంలో టీ-24 టికెట్ ధర రూ.120ఉండగా, దాన్ని ఇటీవల రూ.100కు తగ్గించారు. అలాగే టీఎస్ ఆర్టీసీ మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టిక్కెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.50తో టికెట్ తీసుకుంటే మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య నగరంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే ఎఫ్-F-24 టిక్కెట్‌ను రూ. 300తో కొనుగోలు చేస్తే నలుగురితో కూడిన కుటుంబం 24 గంటల పాటు హైదరాబాద్ మొత్తం ప్రయాణించవచ్చు.