TTD: ఏఆర్ డెయిరీపై టీటీడీ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తూ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సరఫరా ఆర్డర్ ఇవ్వగా, జూన్ 12, 20, 25 తేదీలతో పాటు జులై 6న నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేశారని తెలిపారు. పాత విధానం ప్రకారం ఆ నెయ్యిని టెస్టింగ్ చేసి వినియోగించినట్లు పేర్కొన్నారు.
ఏఆర్ డెయిరీకి షోకాజ్ నోటీసులు
తిరుమల లడ్డూ ప్రసాద నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ అనుమానంతో NDBL సహకారంతో అడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించింది. జులై 6, 12 తేదీల్లో ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని టెస్టింగ్ కోసం పంపగా, NDBL చేసిన పరీక్షల్లో నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్, జంతు కొవ్వు కలిసినట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ అంశాలపై జులై 22, 23, 27 తేదీల్లో ఏఆర్ డెయిరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, సెప్టెంబర్ 4న ఏఆర్ డెయిరీ తన సమాధానంలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొంది. ఈ వివరాలను టీటీడీ తన ఫిర్యాదులో పొందుపరిచింది.
సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ
ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా సిట్ ఏర్పాటు చేసే కసరత్తు పూర్తయింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నియమితులయ్యారు. అలాగే విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్‌జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిట్‌లో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సిట్ ఏర్పాటు పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు టీటీడీలో జరిగిన ఇతర వివాదాలపై కూడా సిట్ విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం.