TTD: శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల బీమా.. ఏడు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన భక్తులకు మాత్రమే అందుబాటులో ఉన్న బీమా సదుపాయాన్ని విస్తరించింది. ఇకపై సహజంగా మరణించిన భక్తుల కుటుంబాలకు కూడా బీమా పరిహారం అందించనుంది. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో సహజ మరణానికి రూ.2 లక్షల బీమా అందించేలా 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత భరోసా కల్పిస్తున్నామని తితిదే సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
వివరాలు
సెప్టెంబర్ 9న 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకం ప్రారంభం
గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు మంగళవారం బీమా పరిహారం అందించారు.
తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామితో కలిసి ఈవో రవిచంద్ర ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా పరిహారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఈవో రవిచంద్ర మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ బీమా పథకాన్ని రూపొందించామన్నారు.
వివరాలు
ఈ పథకాన్నిఎల్ఐసీ రూపొందించింది
దీని ప్రకారం తిరుమలలో సహజంగా మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున బీమా పరిహారం అందిస్తామని వివరించారు.
గత రెండు నెలల్లో తిరుమలలో మొత్తం 17మంది భక్తులు మరణించగా.. వారిలో ఏడుగురి కుటుంబాలకు ఇప్పటికే బీమా పరిహారం అందించినట్లు తెలిపారు.
మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. భక్తులకు ఇలాంటి బీమా సదుపాయం కల్పించేందుకు సుమారు ఏడాదిన్నర పాటు కృషి చేసినట్లు తెలిపారు.
తితిదే కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించి అమలు చేసేందుకు సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.
భవిష్యత్తులో భక్తులకు అందించే బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
వివరాలు
టికెట్ ఉన్నా.. లేకపోయినా బీమా వర్తింపు
శ్రీవారి దర్శనం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులతో పాటు ఎలాంటి టికెట్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చే భక్తులకూ ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది.
ముందుగా దర్శన టికెట్లు పొందిన వారి వివరాలు నేరుగా ఎల్ఐసీ డేటాబేస్‌లో నమోదవుతాయి.
టికెట్లు లేకుండా వచ్చే భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన వెంటనే తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సాంకేతిక వ్యవస్థ ద్వారా వారి వివరాలను గుర్తిస్తారు.
అనంతరం వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకొస్తారు. భక్తులకే కాకుండా తిరుమలలో నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులకు కూడా ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది.