J&K: జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం రూ.30 లక్షల రివార్డు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం, కిష్త్వార్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల నేపథ్యంలో కేంద్ర భద్రతా సంస్థలు నిఘాను మరింత పెంచాయి. పలు జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించి, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. కుల్గాంలో సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు కిష్త్వార్‌లో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్‌పీవోలు) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన వారి మృతదేహాలు గురువారం ఉదయం బుల్లెట్ గాయాలతో కనిపించాయి. ఈ ఘటనలతో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వివరాలు
దాడి స్థలాన్ని పరిశీలించిన ఎన్‌ఐఏ
కుల్గాంలోని సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై జరిగిన దాడి స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు పరిశీలించారు.
ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ దాడిలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
వారిలో కనీసం ఇద్దరు విదేశీయులు అయి ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి పలువురు అనుమానితులను భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ముగ్గురు ఉగ్రవాదుల కోసం.. రూ.30 లక్షల నగదు బహుమతి
ఇదిలా ఉండగా.. ఇద్దరు ఎస్‌పీవోల హత్యకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల కోసం కిష్త్వార్ పోలీసులు రూ.30 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
మహమ్మద్ అమీన్ అలియాస్ జహంగీర్, రియాజ్ అహ్మద్ అలియాస్ హజారీ, ముదాసిర్ హుస్సేన్‌లను నిందితులుగా గుర్తించారు.
వారి వివరాలతో కూడిన వాంటెడ్ పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. ఈ ముగ్గురి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
విశ్వసనీయ సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
వివరాలు
జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో అపప్రమత్తమైన భద్రతా బలగాలు
బుధవారం నుంచి ఇద్దరు ఎస్‌పీవోలు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
అదనపు సిబ్బందిని రంగంలోకి దించి, అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచాయి.
మరిన్ని దాడులు జరగకుండా చూడటంతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు చేపట్టాయి.