జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నివిషాల వ్వవధిలోనే ఈ పేలుళ్లు జరగ్గా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో ఈ పేలుళ్లు సంభవించాయి. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. గాయపడిన వారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపి క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు జమ్ము ఏడీజీపీ ముకేశ్ వెల్లడించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేళ పేలుళ్లు
పేలుళ్లు జరిగిన ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో అన్ని రకాల వాహనాలకు మరమ్మతులు నిర్వహిస్తుంటారు. యార్డు కాంప్లెక్స్ పరిధిలో టైర్లు, స్పేర్ పార్ట్స్, జంక్ డీలర్లు, కారు యాక్సెసరీల దుకాణాలు ఉన్నాయి. మరమ్మతుల కోసం తీసుకొచ్చి ఓ వాహనంలో మొదటి పేలుడు సంభవించినట్లు ప్రత్యేక్ష సాక్షి, వాహనాన్ని రిపేర్ చేసే జస్విందర్ సింగ్ చెప్పారు. అనంతరం 15 నిమిషాల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూలో కొనసాగుతున్న సమయంలో ఈ పేలుడు జరగడం గమనార్హం.