LOADING...
Stampede: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి  
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి

Stampede: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మరవకముందే, మరో విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బారాబంకీ జిల్లాలోని ఓ ప్రసిద్ధ ఆలయంలో భక్తుల రద్దీ మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అనేక మంది భక్తులు గాయపడ్డారు. ఓ విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తుల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొని, భయాందోళనతో పరుగులు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. శ్రావణ సోమవారం సందర్భంగా బారాబంకీలోని పురాతన ఔసానేశ్వర్‌ మహదేవ్‌ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే భక్తుల రాక ప్రారంభమవడంతో ఆలయం పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఇదే సమయంలో ఆలయం సమీపంలో ఉన్న విద్యుత్ తీగలపై కొంతమంది కోతులు ఎగిరిన కారణంగా ఒక తీగ తెగిపడి, భక్తులపై పడింది.

వివరాలు 

19 మందికి విద్యుత్‌ షాక్‌

దాంతో కొందరికి విద్యుదాఘాతం తగలగా,మిగిలినవారు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఆందోళనతో తొక్కిసలాట ఏర్పడి,దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కనీసం 19 మందికి విద్యుత్‌ షాక్‌ తగిలినట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు,గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు స్పష్టం చేశారు.

వివరాలు 

హరిద్వార్‌లో విషాదకర ఘటన

అయితే, దీనికంటే ముందు రోజైన ఆదివారం ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లో కూడా ఇలాగే విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివాలిక్‌ కొండలపై సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయానికి మెట్లదారిలో భక్తులు చేరుతున్న సమయంలో తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. ఆలయ మెట్ల ప్రారంభ బిందువులో విద్యుదాఘాతం జరిగినట్లు వదంతులు వ్యాపించడంతో భక్తులు భయాందోళనకు లోనయ్యారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు పేర్కొన్నారు.