Page Loader
ponzi scheme: ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు
ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు

ponzi scheme: ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ప్రజల నుంచి రూ. 850 కోట్ల భారీ మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ప్రధాన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల,డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఛైర్మన్ అమర్‌దీప్ కుమార్,సీఈవో యోగేందర్ సింగ్ సహా మరికొందరు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డీసీపీ కె. ప్రసాద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.

వివరాలు 

 2021 నుంచి ప్రజల నుంచి డిపాజిట్లు 

2021 నుంచి డిపాజిట్ల రూపంలో పెద్ద ఎత్తున మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. అమర్‌దీప్ కుమార్,యోగేందర్ సింగ్,పవన్ కుమార్,కావ్య తదితరులు కలిసి హైటెక్‌సిటీ హుడా ఎన్‌క్లేవ్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థను స్థాపించారు. దీని అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్,ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ సహా మరికొన్ని సంస్థలను నెలకొల్పారు. సాధారణంగా,ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటే వ్యాపార సంస్థలు తమకు రావాల్సిన బకాయిలను మూడో వ్యక్తికి డిస్కౌంట్‌తో విక్రయిస్తారు. కానీ నిందితులు దీని పేరు ఉపయోగించి ప్రజలను మోసగించారు.అధిక వడ్డీ రేట్లు అందిస్తామని చెప్పి 2021 నుంచి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం ప్రారంభించారు. తమకు ప్రముఖ కంపెనీలతో లావాదేవీలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించి ప్రచారం చేశారు.

వివరాలు 

 14 సంస్థలలోకి డబ్బు మళ్లింపు 

గడువు మేరకు కనిష్ఠంగా 11% నుంచి గరిష్టంగా 21.95% వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు. నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి నిందితులు రూ. 1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో కొన్ని నెలల పాటు చెల్లింపులు సక్రమంగా సాగాయి. కానీ,కొంతకాలం తర్వాత పూర్తిగా ఆపేశారు. ఇలా రూ. 850 కోట్ల మొత్తాన్ని బాధితులకు చెల్లించకుండా దారి మళ్లించారు. ఈ డబ్బును 14 సంస్థలలోకి మళ్లించి మోసాన్ని కొనసాగించారు.

వివరాలు 

40 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

వీటిలో కాయిన్ ట్రేడ్ (క్రిప్టో కరెన్సీ), బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా (గొలుసుకట్టు స్కీం), గోవాలోని యుకియో రిసార్ట్, దుబాయ్ ప్రైవేట్ జెట్ సేవల సంస్థ ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ, స్వస్తిక్ నెయ్యి, హాష్‌బ్లాక్, వెల్ ఫెల్లా హెర్బల్ బిజినెస్, సింగపూర్, యూఏఈలో పనిచేసే ఓజాస్ వంటి సంస్థలు ఉన్నాయి. మోసానికి గురైన బాధితులు హైటెక్‌సిటీ కార్యాలయాన్ని సంప్రదించేందుకు వెళ్లగా, నిందితులు అప్పటికే కార్యాలయాన్ని మూసివేసి జనవరి 15, 2025 న పరారయ్యారు. ఈ వ్యవహారంపై బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించగా,పోలీసులు ఈ కేసులో మొత్తం 40 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

వివరాలు 

 2022లో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు 

ఇప్పటికే పవన్ కుమార్, కావ్య అరెస్టు కాగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. విచారణలో భాగంగా నిందితులు గతంలోనూ బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో గొలుసు కట్టు మోసానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై 2022లో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఈ మోసం దేశవ్యాప్తంగా విస్తరించడంతో, ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులపై కేసులు నమోదవుతున్నాయి.