Page Loader
ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు
ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు

ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్‌కు వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్‌లను శుక్రవారం రాత్రి టెర్మినల్ 2 వద్ద అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వీరిని ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరిపై ఐసిస్ స్లీపర్ సెల్‌లతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని చట్టపరమైన ప్రక్రియల కోసం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Details

ఇప్పటివరకూ 10 మంది అరెస్టు

2023లో మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఐఈడి తయారీ, పరీక్షల కేసులో వీరిద్దరిపై ఇప్పటికే స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. అప్పట్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు దేశంలో భారీ కుట్రలకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పుణేలో బాంబు తయారీ శిక్షణ శిబిరం నిర్వహించినట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు అధికారాలు ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు నగదు బహుమతిని ప్రకటించాయి. ఇద్దరూ రెండేళ్లుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఐసిస్‌కు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని దేశం నుండి పూర్తిగా నిర్మూలించేందుకు ఎన్‌ఐఏ తీసుకుంటున్న చర్యల్లో ఈ అరెస్ట్‌లు కీలకమైన మైలురాయిగా నిలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.