
SpiceJet: కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి యత్నం.. విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల హల్‌చల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు గందరగోళం సృష్టించారు. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉండగానే, వారు కాక్‌పిట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పైలట్లు,విమాన సిబ్బంది వారికి ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపివేసి, ఆ ఇద్దరు మహిళల్ని కిందికి దించి సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి ముంబయికి బయలుదేరాల్సిన ఈ స్పైస్‌జెట్ విమానాన్ని ట్యాక్సీయింగ్ కోసం తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
వివరాలు
ఇద్దరు మహిళా ప్రయాణికులను సీఐఎస్ఎఫ్‌కు అప్పగింత
ఆ సమయంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు అకస్మాత్తుగా తమ సీట్ల నుంచి లేచి గొడవ పెట్టుకున్నారు. సిబ్బంది వారిని అడ్డుకున్నా వినిపించుకోకుండా కాక్‌పిట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది వారిని చెప్పినా వారు తమ స్థానాలకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పైలట్ విమానాన్ని తిరిగి బే వే వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఇద్దరు మహిళా ప్రయాణికులను దింపి సీఐఎస్ఎఫ్‌కు అప్పగించినట్లు స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన కారణంగా విమానం దాదాపు ఏడు గంటల ఆలస్యానికి గురైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం రాత్రి 7.31 గంటలకు ముంబయికి టేకాఫ్ అయ్యింది.
వివరాలు
స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య
అంతకుముందు, జూన్ 13న మరో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పుణే నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో సమస్య గుర్తించడంతో పైలట్లు వెంటనే విమానాన్ని ఆపేశారు. మరమ్మతుల అనంతరం దాదాపు 9 గంటల ఆలస్యంతో ఆ విమానం గమ్యస్థానానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.