Loading...
UAE: యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులతో సహా 14 మంది మృతి
యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులతో సహా 14 మంది మృతి

UAE: యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులతో సహా 14 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అదుపుతప్పిన భారీ ట్రక్కు రద్దీగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి,అనంతరం మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు భారతీయులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుజైరా ప్రవేశ ద్వారం సమీపంలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో తొలుత ఓ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ట్రక్కు బోల్తాపడి,ట్రాఫిక్ రద్దీ కారణంగా నెమ్మదిగా వెళ్తున్న లేదా నిలిచిపోయిన వాహనాలపైకి దూసుకెళ్లింది.

వివరాలు 

భారతీయుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి

మొత్తం 23 వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి. వీటిలో 18 కార్లు, ఐదు ట్రక్కులు ఉన్నాయి.

ట్రక్కు ఢీకొన్న ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి చుట్టుపక్కల ఉన్న ఇతర వాహనాలకూ వ్యాపించాయి.

దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాహనాలు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రాణనష్టం తీవ్రంగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది.

కేరళకు చెందిన పలువురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు భారత కాన్సులేట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

వివరాలు 

డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతుల గుర్తింపు

బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత కాన్సులేట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన 30 మందిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించాయి.

క్షతగాత్రుల్లో సగం మంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారికి వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతుల గుర్తింపు

మరోవైపు, ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారి వివరాలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

అధికారిక వర్గాలు వెల్లడించే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

ADVERTISEMENT