Loading...
Udhayanidhi Stalin: విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ..! గవర్నర్‌ను ఆశ్రయించిన డీఎంకే
విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ..! గవర్నర్‌ను ఆశ్రయించిన డీఎంకే

Udhayanidhi Stalin: విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ..! గవర్నర్‌ను ఆశ్రయించిన డీఎంకే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రభుత్వం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై సీబీఐతో విచారణ జరిపించాలని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రతినిధి బృందం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమైంది.

వివరాలు  

కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై విచారణ

ఈ భేటీలో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌తో పాటు పలువురు డీఎంకే నాయకులు పాల్గొన్నారు. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్య సందేశాలు పంపినట్లు వచ్చిన ఆరోపణలతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఇతర ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

కస్టడీలో తొమ్మిది మంది మరణించిన ఘటనలు,జింగీలో మైనర్ బాలిక అదృశ్యం,డ్రగ్స్ కేసులో టీవీకే కార్యకర్తల ప్రమేయం వంటి అంశాలపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ఉదయనిధి కోరారు.

ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గవర్నర్‌ను కోరిన ఉదయనిధి

గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

ఈ వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పందించిన తీరును కూడా ఉదయనిధి ప్రశ్నించారు.

ADVERTISEMENT

వివరాలు 

బీజేపీ నియమించిన గవర్నర్‌తో గతంలో విభేదాలు

ఈ ఆరోపణల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, టీవీకే ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తు అవసరమని డీఎంకే డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.

మరోవైపు, బీజేపీ నియమించిన గవర్నర్‌తో గతంలో విభేదాలు వ్యక్తం చేసిన డీఎంకే నేతలు.. ఇప్పుడు అదే గవర్నర్‌ను కలిసి విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ జరిపించాలని కోరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT