Page Loader
సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ
యూనివర్సిటీలకు యూజీసీ లేఖ

సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 02, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిగ్రీ, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది. ఈ మేరకు స‌ర్టిఫికెట్ల‌పై ఇక నుంచి ఆధార్ సంఖ్యను ప్రింట్ చేయ‌డాన్ని నిషేధించింది. వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లేందుకు అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని విశ్వవిద్యాలయాలకు రాసిన లేఖలో వివరించింది. ఇప్పటికే యూజీసీకి అందిన పలు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న సందర్భంగా తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆధార్ సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరాదని భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) నిబంధనల స్పష్టం చేస్తున్నాయి.

DETAILS

ఆధార్ నంబర్ ముద్రించాలని కోరిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు

డిగ్రీలు, ప్రొవిజన్‌ సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించటాన్ని అనుమతించబోమని యూజీసీ కార్యదర్శి మ‌నీష్ జోషి యూనివ‌ర్సిటీల‌కు లేఖ సంధించారు. డిగ్రీ పట్టాలు, ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల మీద ఆధార్ నంబ‌ర్లు ప్రింట్ చేస్తే అవి ఆమోదయోగ్యం కానివన్నారు. యూఏడీఏఐ నిబంధ‌న‌ల‌ను ఉన్న‌త విద్యాసంస్థ‌లు క‌చ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్ర‌వేశాలు, రిక్రూట్‌మెంట్ల విష‌యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆధార్ సంఖ్యను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ప‌రిధిలోని విశ్వవిద్యాలయాలు అభ్య‌ర్థుల డిగ్రీ పట్టాలపై, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబ‌ర్లను ముద్రిస్తున్నారు. ఇది స‌రైంది కాదని యూజీసీ వివరించింది. డిగ్రీ మార్కుల మెమోలపై పూర్తి ఆధార్ నంబర్‌ ముద్రిస్తే అడ్మిషన్‌ వెరిఫికేషన్‌ సమయంలో సాయపడుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.