
Nirav Modi: యూకే హైకోర్టులో నీరవ్ మోదీకి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13 వేల కోట్లకు మించి మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్ హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది. అతను దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తోసిపుచ్చిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వెల్లడించింది. లండన్‌లో ఉన్న సీబీఐ బృందం సహకారంతో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) బెయిల్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సీబీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో బెయిల్ లభించకుండా నిరోధించగలిగినట్టు పేర్కొంది.
వివరాలు
రూ.13,000 కోట్ల స్కాం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరిగిన భారీ రుణ మోసం కేసులో భారత్‌కు తిరిగి రప్పించాల్సిన ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీకి 2019 మార్చిలో అప్పగింత వారెంట్‌పై యూకే అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నాడు. ఇక 2018 జనవరిలో, పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందు, నీరవ్ మోదీ భారత్ నుంచి పారిపోయాడు. మొత్తం రూ.13,000 కోట్ల స్కాంలో, అతను రూ.6498.20 కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ మోసం కేసులో నీరవ్ మోదీతో పాటు అతని మామ మెహుల్ చోక్సీపై కూడా ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
భారత్‌లో నీరవ్ మోదీపై మొత్తం మూడు క్రిమినల్ కేసులు
ఇటీవల చోక్సీని బెల్జియంలోని అధికారాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆయన అప్పట్లో నిరాకరించారు. భారత్‌లో నీరవ్ మోదీపై మొత్తం మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో మొదటిది - పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ మోసం చేసినందుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసు. రెండవది - ఆ మోసంతో వచ్చిన డబ్బును అక్రమంగా లాండర్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు. మూడవది - సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఆధారాలు, సాక్ష్యాలతో జోక్యం చేసుకున్న ఆరోపణలపై నమోదైన మరో కేసు.