
Odisha: లెక్చరర్ లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లెక్చరర్ లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలేశ్వర్ ఎఫ్.ఎం. కళాశాల విద్యార్థిని మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని శరీరం 95 శాతం కాలిన గాయాలతో ఉండటంతో ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాధిత విద్యార్థిని బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో విభాగాధిపతిగా పనిచేస్తున్న సమీర్ సాహు కొంతకాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తన కోరికను నెరవేర్చకపోతే భవిష్యత్తును నాశనం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.
Details
మూడ్రోజుల పాటు చికిత్స
ఈ నేపథ్యంలో విద్యార్థిని జూన్ 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసకపోవడంతో విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. ఆవేదనతో జూన్ 12న కాలేజీ క్యాంపస్‌లో నిరసన చేపట్టిన ఆమె.. ప్రిన్సిపల్ కార్యాలయం వైపు పరుగెత్తి అక్కడే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమె కేకలతో స్పందించిన తోటి విద్యార్థులు రక్షించేందుకు ప్రయత్నించగా, వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించగా, మూడు రోజులపాటు చికిత్స పొందిన విద్యార్థిని చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటనపై రాజకీయంగా తీవ్ర ప్రతిచర్యలు వస్తున్నాయి.
Details
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
బాధిత విద్యార్థిని బాధను పట్టించుకోకుండా వ్యవహరించిన ప్రభుత్వం, విద్యాశాఖపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ, వైద్యశాఖ యత్నించినా ప్రయోజనం లేకపోయిందని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ఆయన, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Details
కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య దిలీప్ సస్పెండ్
ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రిలో వ్యక్తిగతంగా పరిశీలించి సమాచారం తీసుకున్నారు. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య దిలీప్ ఘోష్‌ను ఇప్పటికే సస్పెండ్ చేయగా, సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. లెక్చరర్ సమీర్ సాహును కూడా పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన విద్యా సంస్థల లోపాలను, బాధితులకు న్యాయం ఆలస్యమయ్యే పరిస్థితులను బట్టబయలుచేస్తోంది.