Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్ పాటిల్
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత పోలవరం నిర్మాణ పనులు వేగవంతమైందని కేంద్రమంత్రి చెప్పారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి కేంద్రం భారీ నిధులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధులను తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన గృహప్రవేశ సమారంభంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పై వివరణ ఇచ్చారు.
ప్రాజెక్టు వ్యయం 70,000కోట్లు
ఆయన వ్యాఖ్యలతో పోలవరం ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం,పోలవరం ప్రాజెక్టు ఏపికి జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. 2027నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది,దీన్ని 2026మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 70,000కోట్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు. గోదావరి,కృష్ణా,పెన్నా నదులను అనుసంధానం చేసే పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతాయి. పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వేగంగా సాగాయి. అయితే, రివర్స్ టెండరింగ్ సమస్య కారణంగా పదిహేడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. వైసీపీ పాలనలో ప్రాజెక్టు పనులు మందగించినట్టు తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్ల నిధులు
2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో 71.93% పనులు పూర్తయ్యాయని, ఆ తరువాత 2019-2024 మధ్య కేవలం 3.84% మాత్రమే పూర్తయింది అని కేంద్రం గణాంకాలను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్ల నిధులు పోలవరం ప్రాజెక్టు పనులకు కేటాయించబోతున్నామని కేంద్రం ప్రకటించింది. వీటితో డయాఫ్రం వాల్ నిర్మాణం సహా కీలకమైన పనులు పూర్తి చేయాలని కేంద్రమంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం కూడా పూర్తి అవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. పాత డయాఫ్రం వాల్ నష్టం కారణంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.1,200 కోట్లు అవసరమని కేంద్రం అంచనా వేసింది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రూ.31,500 కోట్లు
అలాగే, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రూ.31,500 కోట్లు కావాలని నిర్ణయించింది. దీనికోసం కూడా కేంద్రం నిధులు జారీ చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వరదలు కారణంగా నీటి లీకేజ్ సమస్య ఎదురైనందున దీనిని నివారించేందుకు నూతన సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించారు. 2019-2024 మధ్య వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిధులు సరైన విధంగా వినియోగించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించబడుతుంది, అలాగే 28.5 లక్షల మందికి తాగు నీరు కూడా అందుతుందని కేంద్రం పేర్కొంది. అదనంగా, 960 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యంగా చూస్తుంది.