Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇటీవల భోపాల్ నుంచి దిల్లీకి విమాన ప్రయాణం చేయడానికి ఆయన టికెట్ బుక్ చేసుకోగా, విరిగిపోయిన సీటు ఆయనకు కేటాయించారు.
విమానంలోని మరికొన్ని సీట్ల పరిస్థితి కూడా అలాగే ఉండగా, మంత్రి అదే సీటులో కూర్చొని 1.30 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నుండి దిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఏఐ436 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు.
Details
చాలా సీట్లు విరిగిపోయాయి
అయితే, సంస్థ ఆయనకు 8С నెంబర్ సీటును కేటాయించింది. విమానం ఎక్కిన వెంటనే తన సీటు విరిగిపోయినదిగా గుర్తించారని తెలిపారు.
ఇది చూసి ఆశ్చర్యపోయిన మంత్రి వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, యాజమాన్యం ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించినట్లు సమాధానమిచ్చిందని చెప్పారు.
అంతేకాకుండా ఆ సీటును ప్రయాణికులకు కేటాయించకూడదని ముందుగా ఆదేశించినట్లు కూడా తెలియజేశారని వివరించారు.
ఈ ఒక్క సీటే కాదు, విమానంలో పలు సీట్లు కూడా పాడైపోయినట్లు గుర్తించానని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Details
ప్రయాణికులను మోసం చేయడం అన్యాయం
ఈ సమస్యను గమనించిన తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని కోరినప్పటికీ, వారిని అసౌకర్యానికి గురిచేయకుండా తానే విరిగిన సీటులో కూర్చొని 1.30 గంటల పాటు ప్రయాణం చేసినట్లు వెల్లడించారు.
ఈ పరిస్థితిని ఆయన విమర్శిస్తూ, ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.
ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ చేపట్టిన తర్వాత సేవలు మెరుగుపడతాయని భావించానని, కానీ ఇది కేవలం అపోహగానే మిగిలిందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.