
పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు.. బాలికను గర్భవతిని చేసిన స్వామిజీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గత సోమవారం లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద సరస్వతి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ మేరకు అతని రిమాండ్ రిపోర్టులో ఊహించని సంచలన విషయాలు బట్టబయలయ్యాయి.
పూర్ణానంద, అర్ధరాత్రుళ్లు పలువురు బాలికలను నిద్ర లేపేవాడని, అనంతరం తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడులు జరిపేవాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పలుమార్లు అత్యాచారం అనంతరం ఓ బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే విషయం తెలిసిన సదరు బాలిక బంధువులు, వెంటనే ఆమెను తమతో పాటు తీసుకెళ్లారని సమాచారం.
తనపై జరుగుతున్న దారుణాలను తట్టుకోలేక ఆశ్రమం నుంచి తప్పించుకున్న ఓ బాలిక ఎట్టకేలకు విజయవాడ చేరుకుని దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వామిజీ డొంక కదులుతోంది.
DETAILS
పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు
పూర్ణానందపై ఫిర్యాదు చేసిన బాలిక, గత రెండేళ్లుగా అత్యాచారానికి గురైందని రిపోర్టులో వెల్లడైంది. అయితే ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు.
మైనర్ బాలికలపై దాష్టీకానికి పాల్పడిన కారణంగా నిందితుడిపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్ణానందపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. భూవివాదాల్లోనూ అతనికి ప్రమేయం ఉందని పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. ఈ మేరకు తొమ్మిదిన్నర ఎకరాల ఆశ్రమ భూమి సైతం వివాదంలో చిక్కుకుంది.
అయితే అంతకుముందే జూలై 5 వరకు పూర్ణనందకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు.