LOADING...
Unnao Rape Case: ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్‌ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు
కుల్దీప్‌ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Unnao Rape Case: ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్‌ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి 'కస్టడీ' మృతి కేసులో భాజపా నుంచి బహిష్కృతుడైన నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శిక్ష విషయంలో ఉపశమనం ఇవ్వడానికి తగిన కారణాలు లేవని జస్టిస్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు.

వివరాలు 

కుల్దీప్‌ సెంగర్‌ను కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ

ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఇప్పటికే కుల్దీప్‌ సెంగర్‌ దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ దిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కొన్ని షరతులతో బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం శిక్ష నిలిపివేత ఉత్తర్వులపై స్టే విధించింది. కుల్దీప్‌ సెంగర్‌ను కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

పదేళ్ల జైలు శిక్ష

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం 2018 ఏప్రిల్‌లో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరగడంతో, 2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసుతో పాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తర్‌ప్రదేశ్‌ ట్రయల్‌ కోర్టు నుంచి దిల్లీకి బదిలీ చేశారు. విచారణ అనంతరం అత్యాచారం కేసులో కుల్దీప్‌కు జీవిత ఖైదు, బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.

Advertisement