
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ఘటన మరువకముందే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే ఓ భార్య, తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది.
ఈ హత్య కోసం ఆమె రూ. 2 లక్షల మేరకు కాంట్రాక్ట్ కిల్లర్‌ను అద్దెకు తీసుకుంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు.
ఏం జరిగింది?
ఈ నెల 5న ఔరోయాకు చెందిన దిలీప్, ప్రగతిని వివాహం చేసుకున్నాడు.
అయితే, పెళ్లికి ముందు నుంచే ప్రగతికి తన గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్‌తో నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్టు ఎస్‌పీ తెలిపారు.
పెళ్లి తర్వాత ప్రియుడిని కలుసుకోవడం కష్టమవడంతో భర్తను తొలగించాలని ప్రగతి కుట్ర పన్నిందని వెల్లడించారు.
వివరాలు
దారుణ హత్య
ఈ కుట్రలో భాగంగా ప్రగతి, ప్రియుడు మనోజ్ కలిసి రామ్‌జీ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను అద్దెకు తీసుకున్నారు. రూ. 2 లక్షల ఒప్పందంలో, ముందుగా రూ. 1 లక్షను ప్రగతినే సమకూర్చిందని పోలీసులు తెలిపారు.
ఈ మొత్తాన్ని ఆమె పెళ్లిలో వచ్చిన బహుమతులు, నగలు అమ్మి సమకూర్చిందని చెప్పారు.
ఈనెల 19న, నిందితులు బాధితుడిని పొలాల్లోకి తీసుకెళ్లారు.మాయ మాటలు చెప్పి అతన్ని ఒంటరిగా తీసుకెళ్లి అక్కడే కొట్టారు.
చివరగా తుపాకీతో కాల్చివేశారు.అయితే, అతడు అక్కడికక్కడే చనిపోయినట్టు భావించి నిందితులు అక్కడి నుంచి తప్పుకున్నారు.
కానీ,తీవ్ర గాయాలతో ఉన్న దిలీప్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
వివరాలు
హత్యగా కేసు నమోదు
"మార్చి 19న గాయాలతో ఉన్న ఓ వ్యక్తి గురించి మాకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని దిలీప్ యాదవ్‌గా గుర్తించాం. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలోనే అతను మరణించాడు. ఈ నేపథ్యంలో హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాం. ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడికి సహకరించిన ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం." — అభిజీత్ శంకర్, ఎస్‌పీ ఔరోయా
వివరాలు
ఇలాంటి మరో ఘటన - భర్తను 15 ముక్కలుగా చేసి...
ఇటీవల, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఇలాంటి భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.
అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడన్న కారణంగా ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది.
అతని శరీరాన్ని 15 ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో సీల్ చేసి దాచి ఉంచారు.
మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యకేసు వెలుగులోకి వచ్చింది.