
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతాలో కలకలం.. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజాగా కోల్‌కతాలో మరో దారుణం బయటపడింది. ఐఐఎమ్-కోల్‌కతాలో చదువుతున్న ఓ విద్యార్థినిపై, అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలపై కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి కథనం ప్రకారం.. తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయాన్ని తెలిసిన ఆ విద్యార్థి తనకు కౌన్సెలింగ్ చేస్తానని చెప్పి శుక్రవారం బాయ్స్ హాస్టల్‌కు రావాలని ఆహ్వానించాడని తెలిపింది. తనను కలిసిన తర్వాత ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగిన వెంటనే అపస్మారక స్థితికి వెళ్లిపోయానని, స్పృహలోకి వచ్చేటప్పటికి తనపై అత్యాచారం జరిగిందని అనుమానం వచ్చిందన్నారు.
Details
రాష్ట్రంలో మహిళల భద్రతపై తలెత్తున్న ప్రశ్నలు
ఆ విషయంపై ఆ విద్యార్థిని ప్రశ్నించగా తనను బెదిరించాడని తెలిపింది. ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడని బాధితురాలు వివరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందిత విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఐఐఎమ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఇటువంటి ఘటనలు సంభవించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కోల్‌కతాలో ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇటీవల మరో న్యాయ కళాశాల విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరగడం మరవకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం, రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు పెంచుతోంది.