
Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్ట్‌పై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తన అణు కార్యక్రమాలను కొనసాగిస్తోందన్న కారణంగా, ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో పెద్ద అడుగు వేసింది. 2018లో భారత్ సహా కొన్ని దేశాలకు చాబహార్ పోర్టులో కార్యకలాపాలు కొనసాగించేందుకు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫిరేషన్ యాక్ట్ (ఐఎఫ్‌సీఏ) కింద అప్పట్లో అమెరికా ఈ మినహాయింపులను ఇచ్చింది వీటి ఆధారంగా భారత్ చాబహార్ పోర్టు నిర్మాణం, నిర్వహణ, ఇతర వాణిజ్య సంబంధిత కార్యక్రమాలను చేపట్టగలిగింది.
వివరాలు
ప్రత్యామ్నాయ సముద్ర వాణిజ్య మార్గం
అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం,ఇరాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మినహాయింపులు ఉండవు కాబట్టి, ఇరాన్‌తో వ్యాపార లేదా వాణిజ్య లావాదేవీలు జరిపే దేశాలపై IFCA చట్టంప్రకారం ఆంక్షలు అమలు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ సైనికకార్యక్రమాలకు ఆర్థికసహాయం అందించే అన్ని అనధికార మార్గాలను పూర్తిగా మూసివేయడమే అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. భారత్‌కి అప్ఘానిస్థాన్,మధ్య ఆసియా దేశాలకు చేరుకునేందుకు పాకిస్థాన్‌పై ఆధారపడని ఒక ప్రత్యామ్నాయ సముద్ర వాణిజ్య మార్గం అవసరం ఏర్పడింది. దానికి పరిష్కారంగా ఇరాన్‌లోని చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తూవస్తోంది.ఈ పోర్టు ద్వారా భారత్‌కి అప్ఘానిస్థాన్‌తోపాటు మధ్య ఆసియా దేశాలకు కూడా సులభంగా చేరుకునే అవకాశముంది.
వివరాలు
విదేశీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ కుదుర్చుకున్నతొలి ఒప్పందం
అయితే, మినహాయింపుల ఉపసంహరణతో భారత్‌కి పెద్ద సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది భారత్, ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చాబహార్ పోర్టును 10 సంవత్సరాలపాటు భారత్ నిర్వహించాల్సి ఉంది. విదేశీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ కుదుర్చుకున్న ఇది తొలి ఒప్పందం. ఆ ఒప్పందం మేరకు ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (IPGL) సుమారు 120 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదేవిధంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం మరో 250 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక రుణాలను సమీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వివరాలు
అఫ్ఘానిస్థాన్ గోధుమలు, ఇతర సరుకులు చాబహార్ పోర్టు ద్వారా భారత్‌కు..
చాబహార్ పోర్టు భారత్‌కి కేవలం వాణిజ్య ద్వారం మాత్రమే కాదు, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన కేంద్రం కూడా. ఇది అప్ఘానిస్థాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు వాణిజ్య రవాణాకు కీలక మార్గంగా పనిచేస్తుంది. అంతేకాక, భారత్‌ను రష్యా, ఐరోపాతో అనుసంధానం చేసే నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం కూడా ఇదే. ఇప్పటికే అఫ్ఘానిస్థాన్ గోధుమలు, ఇతర సరుకులు చాబహార్ పోర్టు ద్వారా భారత్‌కు చేరుతున్నాయి.