Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు ఝలక్ ఇచ్చిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై ప్రాదేశిక క్లెయిమ్‌లు చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా నిర్మొహమాటంగా చెప్పింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగానే అమెరికా పరిగణిస్తున్నదని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి చొరబాట్లను లేదా అతిక్రమణలను క్లెయిమ్ చేయడానికి సైన్యం లేదా ఏ పౌరుడు చేసిన ఏకపక్ష ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన మోడీ
ఇక,అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని గతకొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం వారి భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ అసంబద్ధ ప్రేలాపనలు చేశారు. దీన్ని భారత్ దీటుగా తిప్పికొట్టింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయరాని భాగమని, ఆధారం లేని వాదనలను వల్లె వేయడం వల్ల నిజాలు మారిపోవని చైనాకు మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఇక్కడ ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
13,700 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్
వీటిలో ఒకటి 13,700 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్. అస్సాంలోని తేజ్‌పూర్ నుండి అరుణాచల్‌లోని తవాంగ్‌ను కలిపే రహదారిపై సెలా టన్నెల్ నిర్మించబడింది. 825 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ సొరంగం. అయితే, ఈ రాష్ట్రాన్ని చైనా 'జాంగ్‌నన్'గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై నిరసన తెలిపింది. అది తమ భూభాగమంటూ పదే పదే చెబుతోంది.