ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె కుమార్తె (20) మరణించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, గ్రామస్థులు భిన్న వాదనలు వినిస్తున్నారు. ఇద్దరు ఇంట్లో ఉండగానే పోలీసులు నిప్పు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, వారు తమను తాము నిప్పంటించుకున్నారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఇప్పటి వరకు 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. అభియోగాలు మోపబడిన వారిలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడానికి బుల్‌డోజర్లతో వచ్చారు: గ్రామస్థులు
కాన్పూర్ దేహత్ జిల్లా రూరా ప్రాంతంలోని మదౌలి గ్రామంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడానికి బుల్‌డోజర్లతో వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంటి లోపల కుటుంబ సభ్యులు ఉండగానే నిప్పు పెట్టారని, తాము తప్పించుకోగలిగామని, తన తల్లి ప్రమీలా దీక్షిత్, సోదరి నేహాను రక్షించుకోలేకపోయమని బాధిత కుటుంబ సభ్యుడు శివమ్ దీక్షిత్ చెప్పారు. అధికారులు తమ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఆయన ఆరోపించారు. అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.