LOADING...
Gulfam Singh Yadav:సంభాల్‌లో హత్యకు గురైనా  గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్.. 
సంభాల్‌లో హత్యకు గురైనా గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్..

Gulfam Singh Yadav:సంభాల్‌లో హత్యకు గురైనా  గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీజేపీ నేతకు దుండగులు విషం ఇచ్చి హత్య చేశారు. సాంభాల్ జిల్లాలోని జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (మార్చి 10) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల చేత విష ఇంజెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన ఇంట్లో గుల్ఫం సింగ్ యాదవ్ (60) కూర్చుని ఉండగా, ఓ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా అతనికి విష ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. విషం పూర్తిగా వ్యాపించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు గన్నౌర్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ దీపక్ తివారీ వెల్లడించారు.

వివరాలు 

 కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందం 

గుల్ఫం సింగ్ పరిస్థితి విషమించడంతో ఆయనను చికిత్స కోసం అలీఘర్‌కు తరలించగా, మార్గమధ్యంలోనే మరణించారని CO దీపక్ తివారీ తెలిపారు. యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, అయితే కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తివారీ పేర్కొన్నారు. గుల్ఫం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం,గుల్ఫం సింగ్ కుటుంబ సభ్యులు మొదట అతనిపై కాల్పులు జరిగినట్లు భావించి జునావాయి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అతనికి విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు.అలీఘర్‌కు తీసుకెళ్లే మార్గంలోనే ఆయన మృతి చెందారు. గుల్ఫం సింగ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

వివరాలు 

 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చురుకుగా.. 

ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గుల్ఫం సింగ్ యాదవ్ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. 2004లో గన్నౌర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా,పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహగా, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, ఆయన భార్య జావిత్రి దేవి మూడు సార్లు గ్రామ అధిపతిగా ఎన్నికయ్యారు. 2019లో జునావాయి బ్లాక్ చీఫ్ ఉప ఎన్నికల్లో గుల్ఫం సింగ్ యాదవ్ కుమారుడు దివ్య ప్రకాష్ యాదవ్ బ్లాక్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.