డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు
డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు. పాకిస్థాన్ లో ఉన్న బంధువులను కలుద్దామని వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన కలీమ్ అహ్మద్ అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ల వలలో పడ్డాడు. తాము చెప్పిన పని చేస్తే కలీమ్ కు ఊహించనంత డబ్బు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారు. దీంతో డబ్బుకు ఆశపడి తీవ్రవాదులు అడిగిన పనిని చేసిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక భారత భద్రతా ఏర్పాట్లు, రఫేల్ యుద్ధ విమానంతో పాటు మరికొన్ని కీలక ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశాడు. ఈ మేరకు మేసెంజర్ యాప్ వాట్సాప్ ద్వారా ఐఎస్ఐ టెర్రరిస్టులకు రక్షణ సమాచారాన్ని అందించాడు.
దేశంలో అలజడులకు ఐఎస్ఐ కుట్ర
దీంతో భారతదేశంలోని పలు కీలక ప్రాంతాల్లో దాడులు చేయడం ద్వారా అశాంతిని రేకెత్తించాలనే కుట్రకు తెరలేపారు. కలీమ్ కదలికలపై అనుమానం వచ్చిన కొందరు,స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు పక్కా సమాచారం అందించారు. దీంతో నిందితుడి ఇంటిపై దాడి చేసి సోదాలు చేపట్టారు. మారుపేరుతో తీసుకున్న పలు సిమ్ కార్డులు, పాక్ ఫోన్ నెంబర్లు, ఆయుధాలు, పలు కీలక ఆధారాలు దొరికినట్లు ఎస్టీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. పాక్ పర్యటన నుంచి వెనక్కి వచ్చాక మారుపేరుతో, ఫేక్ అడ్రెస్ ఫ్రూఫ్ సమర్పించి పలు సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటి ద్వారానే చట్టవ్యతిరేక పనులు చేస్తూ యువతను రెచ్చగొట్టి జిహాదీలుగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించారు. కలీమ్ సోదరుడు తహసీన్(తసీమ్) సైతం దేశవ్యతిరేక పనులు చేస్తుండటం కలకలం రేపుతోంది.