
Van Mahotsav: నేటి నుంచి వన మహోత్సవం.. సీఎం రేవంత్‌తో ప్రారంభోత్సవం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విస్తరించి 'ఆకుపచ్చ తెలంగాణ' సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం-2025 కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధాన అధికారి సువర్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రతేడాది జూలై మొదటి వారంలో వన మహోత్సవాన్ని నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి భారీ స్థాయిలో మొక్కల నాటే కార్యాచరణ రూపొందించారు.
Details
వందశాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి
ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కల నాటింపును లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్ శాఖ 7 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రణాళిక. అలాగే అటవీ శాఖ, వ్యవసాయ శాఖలు ఒక్కొక్కటి కోటి మొక్కల చొప్పున నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది లక్ష్యంగా పెట్టుకున్న 20 కోట్ల మొక్కలలో 95శాతం నాటి విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఈసారి 100 శాతం లక్ష్య సాధన కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. వన మహోత్సవం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అటవీశాఖ వెల్లడించింది.
Details
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ
ఈసారి వన మహోత్సవంలో పది ప్రభుత్వ శాఖలకు ప్రత్యేకంగా మొక్కల నాటే లక్ష్యాలు కేటాయించారు. వేప, గుల్‌మొహర్, సీతాఫలం, అల్లనేరేడు, చింత, కానుగ వంటి జాతులకు తోడు మామిడి, జామ, కొబ్బరి, మునగ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ వంటి ఉద్యాన పంటల మొక్కలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మొక్కల నాటకం కోసం ప్రభుత్వ భూములు, కమ్యూనిటీ ప్రదేశాలు, అవెన్యూ లైన్లు, రైతుల పొలాలు, చెరువుల కట్టలు వంటి విస్తృత ప్రదేశాలను ఎంపిక చేశారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.