Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?
సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ రైలు ప్రయాణంతో పోలిస్తే 45 నిమిషాలు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 578 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే 7.15 గంటల్లో నాగ్‌పూర్ చేరుకోవచ్చు. ఈనెల 15న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, రైలు నాగ్‌పూర్ నుండి ఉదయం 5 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.
మంగళవారం సెలవు..
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ నుండి బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది. రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్(20833) మధ్య నడిచే వందే భారత్ రైలు వారంలో ఆరు రోజులపాటు సేవలు అందిస్తుంది. ఆదివారం సెలవుగా ఉండగా, ప్రస్తుతం ఈ సెలవు మంగళవారానికి మార్చారు. ఈ మార్పు డిసెంబర్ 10 నుండి అమల్లోకి రానుంది. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలు కూడా మంగళవారాల్లో అందుబాటులో ఉండదు. ఈ మార్పులు కూడా డిసెంబర్ 10 నుండి అమల్లోకి వస్తాయి. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.అధికారులు ఇటీవలే ఏలూరు స్టేషన్లో కూడా ఆపాలని నిర్ణయించారు.