Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు
మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన వందే మెట్రో (Vande Metro) రైలు పేరు ఇప్పుడు మారింది. ఇకపై దీనిని నమో భారత్ ర్యాపిడ్ రైల్ (Namo Bharat Rapid Rail)గా పిలుస్తారు. ఈ పేరుమార్పు అనౌన్స్‌మెంట్ దేశంలో తొలి వందే మెట్రో సేవను ఈరోజు (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Vande Bharat Express) వేగంగా పరుగులు తీస్తున్నాయి. తాజాగా అమృత్ భారత్ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో, ఈ రోజు నుంచి వందే మెట్రో కూడా పట్టాలెక్కనుంది.
కనీస టికెట్ ధర రూ.30
వందే మెట్రో పూర్తి అన్‌రిజర్వ్‌డ్ ఎయిర్ కండీషన్ కోచ్‌లతో రూపొందించబడింది.ఈరైలులో 1150 మంది కూర్చుని,2058 మంది నిల్చుని ప్రయాణించవచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది. అహ్మదాబాద్-భుజ్‌ల మధ్య 9 స్టాపుల వద్ద ఆగే ఈ రైలు,360 కిలోమీటర్ల దూరాన్ని 5గంటల45 నిమిషాల్లో చేరుకుంటుందని చెప్పింది. ఈ రైలు గరిష్ఠంగా 110కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరించింది.ప్రతిరోజు ఉదయం 5.05 గంటలకు భుజ్ నుంచి ప్రారంభమై,10.50 గంటలకు అహ్మదాబాద్ జంక్షన్ చేరుకుంటుందని పశ్చిమ రైల్వే (అహ్మదాబాద్) పీఆర్‌ఓ ప్రదీప్ శర్మ తెలిపారు. ప్రయాణికులు తక్షణమే టికెట్ కొనుక్కొని రైలు ఎక్కొచ్చని వివరించారు.వందే భారత్ తరహాలోనే,ఈ రైలును పూర్తిగా ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా సదుపాయాలతో రూపొందించినట్లు తెలిపారు. కనీస టికెట్ ధర రూ.30గా నిర్ణయించినట్లు సమాచారం.